Sunday, October 6, 2013

Srimadbhaagavathamu - Telugu Prose - Part 3



శ్రీ కృష్ణావతారము
యయాతి జ్యేష్ట పుత్రుడు యదువు వంశము పవిత్ర మైనది . శ్రీహరి ఆ వంశ మందే కృష్ణుడుగా అవతరించెను. యదువంశమున దేవ మీడునికి వసుదేవుడు మున్నగు పదుగురు పుత్రులను కుంతీ మున్నగు ఐదుగురు పుత్రికలను పుట్టిరి. ఆ వసుదేవునకు దేవకీ యందు అష్టమ గర్భమున శ్రీకృష్ణుడు జన్మించెను. ఆయన కధలు విన్నవారికి సంసార దుఃఖ ములు తొలుగును.

ద్వాపర యుగములో చాలామంది రాజులు రాక్ష సాంశ ములతో బుట్టి ప్రజలను పీడించు చుండగా ,భూదేవి బ్రహ్మతో మొర పెట్టుకొనెను .ఆయన ," శ్రీహరి వాసుదేవుడుగా అవతరించి భూభారమును దీర్చు " నని చెప్పెను .
మధుర రాజధానిగా ఉగ్రసేనుడు మాదుర శూర సేనముల నేలు చుండెను. అతని కుమారుడు కంసుడు రాక్ష సాంశ గలవాడు .కూతురు దేవకి. ఆమెను వసుదేవునకు ఇచ్చి పెండ్లి చేసిరి. చెల్లెలిని అత్తవారింటికి పంపుచు కంసుడు గూడ వెంట వెళ్ళెను. దారిలో ఆకాశవాణి ,"నీ చెల్లెలి అష్టమ గర్భ సంజాతుని వలన నీకు చావుకలుగును "అని చెప్పగా వాడు చెల్లెలిని చంప బూనెను. వసుదేవుడు ,"ఆమెను జంప వల దనియు ,పుట్టిన బిడ్డలను నీ కప్పగింతు " ననియు ప్రార్ధింపగా వాడు విడిచెను.

తండ్రిని చెరలో బెట్టి కంసుడు గద్దె నెక్కెను .దేవకీ వసుదేవులకు వరుసగా ఆరుగురు మగ బిడ్డలు పుట్టిరి .వారిని కంసునికియ్యగా వాడు ,"వీరివలన నాకు హాని లేదు తీసికొని పొ"మ్మనెను. ఆమె అట్లే చేసెను . దేవకికి ఏడవ గర్భము రాగా శ్రీహరి మాయాదేవిని బిలిచి ," ఈ దేవకి కడుపులోని పిండమును వసుదేవుని మరొక భార్యయైన రోహిణి గర్భములో నుంచు "మనెను. ఆమె అట్లే చేసెను .దేవకికి గర్భ స్రావ మయ్యెనని అందరును అనుకొనిరి. నారదుడు ఒకనాడు కంసుని యొద్దకు వచ్చి, "నీవు రాక్షసుడవు వసుదేవాదులు దేవతలు చక్రి దైత్య సంహారము చేయుటకు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భమున బుట్టు "నని చెప్పగా వాడు దేవకీ వసుదేవులను చెరలో బెట్టి ,వారి ఆరుగురు పుత్రులను ఒక్కసారే వధించెను .దేవకి ఎనిమిదవ సారి గర్భము దాల్చినది .ఆమెకు శ్రావణ బహుళాష్టమి రాత్రి రోహిణీ నక్షత్రమున మేనమామ గండములో శ్రీ కృష్ణుడు జన్మించెను. విష్ణు నాజ్ఞ పై మాయాదేవి యశోదకు పుత్రికగా జన్మించెను .శ్రీ కృష్ణుని ప్రేరణతో వసుదేవుడు ఆ రాత్రి యమునను దాటి శ్రీకృష్ణుని యశోద ప్రక్కలో పరుండబెట్టి మాయాదేవిని తీసికొని వచ్చెను. దేవకి ప్రసవించిన వార్త కంసునికి దెలిసి వచ్చి ఆడపిల్ల అనియైన చూడక చంపబోవగా మాయాదేవి " నిన్ను చంపువాడు పుట్టినాడు లె" మ్మని చెప్పి అద్రుశ్యు రాలయ్యెను.
కంసుడా మాటలు విని పశ్చాత్తాపముతో దేవకీ వసుదేవులను జూచి, "నేను మీకు చాలా దుఃఖము కలిగించినాను .నన్ను మన్నింపు "డని వారిని విడిచిపెట్టెను .

తరువాత కంసుడు మంత్రులతో ఆలోచింపగా వారు ,"గ్రామములలో వెదకి బాలకులను చంపుద "మని చెప్పిరి .కంసుడా ప్రయత్నములలో నుండెను.

ఇక్కడ వ్రేపల్లెలో యశోదకు కొడుకు పుట్టినాడని విని, నందుడు స్నానము చేసి అలంకరించుకుని బ్రాహ్మణులకు రెండు లక్షల గోవులను దూడలతో దాన మిచ్చెను. ఆకాశము నుండి పుష్ప వర్షము గురిసెను . దివ్య దుందభులుమ్రోగెను .

గోపికలందరును వచ్చి నల్లని బాలుని జూచి సంతోషముతో స్నానము చేయించిరి. వేడుకలు చేసిరి.
నందుడు కంసునికి కానుకలు సమర్పించి ,వసుదేవుని జూడబోయి "నీవు కొడుకులను గోలుపోయి విచారించు చున్నావు .మనము ప్రాణ మిత్రులము నా కొడుకు నీ కొడుకు కాడా?" అని ఓదార్చెను .

                                                     శ్రీ కృష్ణుని బాల్య క్రీడలు
కంసుని పంపున బాల ఘాతిని యైన పూతన వ్రేపల్లెకు సుందరీ రూపముతో వచ్చి శ్రీకృష్ణుని జూచెను. అందరును వలదని వారించు చున్నను వినక శ్రీకృష్ణునికి పాలిచ్చెను. శ్రీ కృష్ణుడు దాని పాలతో పాటు ప్రాణములు గూడా పీల్చివేయగా అది చచ్చి పడెను. బాలునికి రక్షా రేకు కట్టి నందాదులు శాంతి క్రియలు చేసిరి .

తరువాత త్రుణావర్తుడు సుడిగాలి వలె వచ్చి శ్రీకృష్ణునిపై కెత్తుకుని పోగా ఇతడు వానికి బరువయ్యెను. అక్కడనే వానిని జంపెను.
ఒకనాడు కృష్ణుడు మన్ను దిను చుండెను ,భూమికి ప్రియుడు గదా మరి ! గోప బాలురు యశోదకు ఈ సంగతి చెప్పిరి .ఆమె "ఏదీ ,నీ నోరుచూపు "మనగా నోరు దెరచి ఆమెకు బ్రహ్మాండము లన్నియు చూపెను .ఆమె విభ్రాంతి నొందెను.
శ్రీ కృష్ణుడు గోప బాలురతో గలిసి గొల్లల యిండ్లలో పాలు పెరుగు వెన్నలను తాను మెక్కి తోడి బాలురకు గూడ పెట్టెడి వాడు . గోవులయోద్దకు దూడలను విడిచి పాలు కుడి పెడి  వాడు .ఇట్టి పనులెన్నో ! ఆ లీలలు వర్ణించుటకు ఆది శేషుని కైనను శక్తి చాలదు .

No comments:

Post a Comment