Monday, December 25, 2017

Srimadbhaagavathamu - Telugu Prose - Part 1



http://telugubhagavatam.org/?tebha&Skanda=1&Ghatta=1

సృష్టి క్రమము - బ్రహ్మాండ శరీరము

మాయా విభుడైన పరమేశ్వరుని మహాత్త్వత్త్వమునుండి , తమోగుణ ప్రధానమై ద్రవ్య జ్ఞాన క్రియాత్మకమైన అహంకారము పుట్టెను. అది ద్రవ్య శక్తి యైన తామసము ,క్రియా శక్తి యైన రాజసము , జ్ఞాన శక్తి యైన సాత్త్వికము అని మూడు విధములయ్యెను.

తామసాహంకారము నుండి శబ్ద గుణము గల ఆకాశము పుట్టెను. దానినుండి శబ్ద స్పర్శ గుణములు గల వాయువు పుట్టెను. అగ్ని నుండి శబ్ద స్పర్శ రూప రసములు గల నీరు పుట్టెను. దాని నుండి శబ్ద స్పర్శ రూప రస గంధములనెడి అయిదు గుణములు గల భూమి పుట్టెను.

సాత్వికా హంకార మునుండి మనస్సు ,దిక్కులు ,సూర్యుడు ,అశ్వినులు ,అగ్నిదేవుడు ,ఇంద్రుడు ,విష్ణువు ,మిత్రుడు ,ప్రజాపతి ,వాయుదేవుడు ,అనువారు పుట్టిరి .

తేజో రూపమైన రాజసాహంకారము నుండి చెవులు ,చర్మము ,కన్నులు, నాలుక ,ముక్కు అను జ్ఞానేంద్రియములను ,వాక్కు, కరములు ,చరణములు ,గుదము, జననేంద్రియము అను కర్మెంద్రియములను ,బుద్దియు, ప్రాణములను పుట్టినవి .

ఇట్టి వానితో భగవానుడు బ్రహ్మాండ శరీరమును సమకూర్చి ,దానిలో చేతనములు ,అచేతనములు ,అగు వస్తువులను సృష్టించెను .  బ్రహ్మాండము పదివేల యేండ్లు నీటిలో నుండెను .కాల కర్మ స్వభావములకు ప్రేరకుడైన భగవంతుడు ఇది జడముగా నుండుట చూచి తాను జీవరూపుడై దీనిలో ప్రవేశించెను . అపుడా బ్రహ్మాండ దేహుడైన భగవానునికి భూర్భువ స్సువర్మ హర్జస్త పస్సత్య లోకము లనెడి యూర్ధ్వ లోకములు నడుము నుండి ఊర్ధ్వ దేహమును ,అతల ,వితల, సుతల, తాతల , రసాతల ,మహాతల ,పాతాళము లనెడి యధో లోకములు అధో (క్రింది ) దేహమును అయ్యెనని చెప్పుదురు .

ప్రపంచ పురుషుడైన విరాట్పురుషుని ముఖము నుండి బ్రాహ్మణులను ,భుజములనుండి క్షత్రియులను ,తొడల నుండి వైశ్యులను , పాదములనుండి శూద్రులను జన్మించిరి.

ఆ బ్రహ్మాండ (విరాట్ ) పురుషునికి భూలోకము కటి ప్రదేశమనియు ,భవర్లోకము నాభియనియు ,సువర్లోకము హృదయము ,మహార్లోకము వక్షము ,జనలోకము కంటము, తపోలోకము స్తన ద్వయము ,బ్రహ్మ నివాసమైన సత్య లోకము శిరస్సు , ఉపకటి (నడుమునకు కొంచెము క్రింద )అతలము ,తొడలు వితలము ,మోకాళ్ళు సుతలము ,పిక్కలు తలా తలము ,చీలమండలు రసాతలము ,పాదములు మహాతలము ,అరికాళ్ళు పాతాళము అనియు చెప్పుదురు.

కొందరు పాదముల నుండి భూలోకమును ,నాభి నుండి భువర్లోకమును ,శిరము నుండి స్వర్లోకమును బుట్టిన వందురు.

పరీక్షిత్తు   కథ

పరీక్షిత్తు - శాపము

అభిమన్యుని భార్య యైన ఉత్తర గర్భమున పరీక్షిత్తు ప్రాణము లేకుండా పుట్టెను. శ్రీ కృష్ణుడాతనిని బ్రతికించెను . . అతడు వేటకు వెళ్ళినపుడు ,గోరూపములో ఒంటి కాలిపై నిలిచిన ధర్మ దేవతను శూద్ర రూపుడైన కలి పురుషుడు తన్ను చుండెను . పరీక్షిత్తు అతనిం జంపబోగా అతడు ,"నేను కలిపురుషుడను ఇది నాయుగము ఇచ్చట ధర్మ మొక్క పాదముతో నిలిచినను సహించను."అనగా రాజు " నా పరి పాలమున ధర్మము నాలుగు పాదములతో నడవ వలసినదే . నీవు నా రాజ్యములో కనబడ రాదు. కనబడినచో చంపెదను" అనెను. కలి తానుండుటకు చోటు చూపమనెను. రాజు కరుణించి ,"ప్రాణి వధ ,స్త్రీ వ్యసనము ,మద్యపానము జూదము జరుగు చోటులలో నీవుండు" మని కలి పురుషుని పంపి ధర్మ దేవతము నాలుగు పాదాలతో నడిపించెను .

పరీక్షిత్తు ఒక సారి  వేటకు బోయి మృగములను వేటాడి దాహముతో నీటికై వెదకుచు ,తపోనిష్టలో నున్న శమీక మునినీ చూచి మునిని నీళ్లిమ్మని యడిగెను . అతడు వినిపించు కొనలేదు పరీక్షిత్తు   కోపము వచ్చి ఒక  చచ్చిన పామును శమీకుని మేడలో వేసి వెళ్లి పోయెను . .కొంత సేపటికి ముని కుమారుడు శృంగి వచ్చి తండ్రి మెడలోని పామును జూచి కోపించి ," ఈ అకృత్యము చేసిన వాడేడు రోజులలో తక్షకుని కాటు వలన మరణించు గాక " అని శపించెను . శమీకుడు లేచి దివ్య దృష్టితో జూచి ,ధర్మ రక్షకుడైన రాజును శపించి నందుకు కొడుకును మందలించి విషయమును వెంటనే పరీక్షితునకు తెలియ జేసెను .పరీక్షితుడు తాను చేసిన అకార్యమునకు పశ్చాత్తాపము నొంది ,తన కుమారుడైన జనమేజయునకు పట్టాభిషేకము చేసి ,వెంటనే గంగా తీరమునకు బోయి ప్రాయోపవేశము చేసెను .

ఆ సమయములో అతని అదృష్టము కొలది శుక మహర్షి పరీక్షిత్తు నొద్దకువచ్చెను .రాజతనిని పూజించి ,తనకీ యేడు రోజులలో భాగవత కధలు వినిపించి ముక్తి మార్గమును చూపుమని ప్రార్ధించెను .ఆవు దగ్గర పాలు పితుకు నంత కాలమైనను ఒక్క చోట నిలువని శుకుడు ,రాజు ప్రార్ధనను మన్నించి అతనికి భాగవతమును పదేశించుటకు అంగీకరించెను.

జయ విజయులు

వైకుంట ధామమున శ్రీ మహా విష్ణువు మందిరమునకు  కావలివారు జయవిజయులు .ఒకనాడు సనక ,సనందన ,సనత్కుమార ,సనత్సు జాతులను బ్రహ్మ మానస పుత్రులు ఐదేండ్ల బాలకులై శ్రీహరిని జూచుటకు వచ్చిరి .జయ విజయులు వారిని లోనికి బోనీయక అడ్డగించిరి . వారు బ్రహ్మ జ్ఞానుల మైన మమ్ము మీరు అడ్డగించుట న్యాయము కాదనిరి.ఐనను వారు వినలేదు. మునులు వారిని భూలోకములో రాక్షసులై పుట్టుడని శపించిరి .శ్రీహరి వచ్చి విషయము తెలిసి కొని సనకాదులను లోనికి తీసుకుని వెళ్ళెను. తరువాత ద్వార పాలకులు మాధవునకు నమస్కరించి నిలిచిరి .విష్ణువు వారి నోదార్చి మూడు జన్మము లెత్తి నాచే సంహరింప బడి తరువాత వైకుంట మునకు వచ్చెదరు లెమ్మని చెప్పెను .వారు మొదటి జన్మమున హిరణ్యాక్ష హిరణ్య కశిపులు, రెండవ జన్మమున రావణ కుంభ కర్ణులు,మూడవ జన్మమున శిశుపాల దంత వక్త్రులుగా పుట్టిరి. దితి ఒకప్పుడు సంతానము గోరి ,భర్తయగు కశ్యప ప్రజాపతినిజేరెను .ఆమెకు హిరణ్యాక్ష ,హిరణ్య కశిపులు కవలపిల్లలుగా జన్మించిరి .వారు బ్రహ్మను గూర్చి ఉగ్రతపము చేసి అనేక వరములు సంపాదించిరి. ఆ వర గర్వముతో లోకములకు పీడ కలిగించు చుండిరి .హిరణ్యాక్షుడు మరింతగా లోకములను బాధించుచు తన్నెదిరించు వారు కనిపించక వరుణుని మీదికి దండ యాత్రకు బోయెను. వరుణు డతనిని గెలుచుట తన వలన గాదని గ్రహించి ,నిన్నెదిరించు వాడు విష్ణువు ఒక్కడే గావున వైకుంటము నకు బొమ్మనెను .వాడు అచ్చటికి వెళ్లి ,విష్ణువు యజ్ఞ వరాహ మూర్తియై రసాతలమున నున్నాడని విని అచ్చటికి బోయెను.


ప్రహ్లాద చరిత్ర
తన సోదరుడైన హిరణ్యాక్షుని జంపినాడను కోపముతో హిరణ్య కశిపుడు శ్రీ హరిని వధించుటకై బయలు దేరెను. విష్ణు వది యెరిగి సూక్ష్మ రూపుడై ఆ రాక్షసుని గుండెలలోనే దాగి యుండెను. అన్ని లోకములను శ్రీ హరికై వెదకి వెదకి ,అతడు కాన రాక పోవుటచే , తన పరాక్రమము విని శ్రీహరి గుండెలు పగిలి చచ్చి యుండునని తలచి రాక్షసుడు వెదకుట విరమించెను .
హిరణ్య కశిపునికి నలుగురు కొడుకులు .వారిలో పెద్దవాడు ప్రహ్లాదుడు . ప్రహ్లాదుడు మాతృ గర్భములో నున్నప్పటి సంగతి యిది. ఒకసారి హిరణ్యకశిపుడింటిలో లేని సమయము చూచి ఇంద్రుడు గర్భవతి యైన లీలావతి నెత్తుకుని పోవుచుండగా నారదుడు ఎదురై " యిదేల? " అని ప్రశ్నించెను ."హిరణ్య కశిపునకు బుట్టెడి వాడికెంత దుర్మార్గు డగునో యని యీమెను, గర్భస్థ శిశువును చంపుద మానుకొన్నా "నని ఇంద్రుడనగా నారదుడు ,"ఈమె గర్భమున బుట్టెడి వాడు దేవతలకు మిత్రుడే .ఈమెను నా యాశ్రమములో నిలిపి రక్షించెద "నని యామెను గొనిపోయెను . ఆమెకు విష్ణు కధలు వినిపించుచు ఆమెను ,ఆమె కడుపులో నున్న ప్రహ్లాదుని విష్ణు భక్తులుగా తీర్చి దిద్ది హిరణ్య కశిపుని ఇంట దిగ విడిచెను .
ప్రహ్లాదుడు భూత దయ గలవాడు .పెద్దలయందు వినయము గలవాడు .పరస్త్రీలను తల్లులుగా భావించెడి వాడు .ఆటలలో గూడ అసత్య మాడడు . సర్వకాల సర్వావస్థలందును హరినామ స్మరణ చేయుచుండు వాడు .
రాక్షస రాజు తన కొడుకును జూచి చదువని నాడజ్ఞాని యగునని చండా మర్కులను బిలిచి యోప్పగించెను . ప్రహ్లాదుడు గురువులు చెప్పినవి వినుచు గూడ తన హరినామ స్మరణము మానలేదు .
హిరణ్య కశిపుడు ,ప్రహ్లాదుని చదువు పరీక్షింప దలచి పిలిచి యడుగగా ,"చక్రహస్తుని ప్రక చించు చదువే చదువు " అనుచు విష్ణు మహిమను గూర్చి యుపన్యసించెను. రాక్షస రాజు గురువులపై కోపించగా వారాతనిని మరల గురుకులమునకు దీసికొని పోయి రాక్షసోచిత విద్యలు  నేర్పసాగిరి . తిరిగి కొన్నాళ్ళకు తండ్రి పరీక్షింపగా ప్రహ్లాదుడు "చదువులలో మర్మ మెల్ల చదివినా " ననుచు "విష్ణు భక్తియే సంసార తరణో పాయ " మనెను .అది విని హిరణ్య కశిపుడు మహా కోపముతో భటులను బిలిచి వీనిని చంపుడని యాజ్ఞాపించెను . వారు శూలముతో బొడిచిరి . ఎనుగులచే త్రొక్కించిరి . పాములచేగరిపించిరి .సముద్రములో ముంచి వేసిరి .కొండ కొమ్ముల మీది నుండి పడ ద్రోసిరి .విషము బెట్టిరి .అగ్నిలో తోసిరి .అన్నము నీరు పెట్టక మాడ్చిరి .ఎన్ని చేసినను ప్రహ్లాదుడు చావలేదు హరి నామ స్మరణము మానలేదు . కొంచెము గూడ భయపడ లేదు. కందలేదు . ఎన్ని చేసినను చావని కొడుకును చూచి రాక్షస రాజు ఆశ్చర్య పడి ,చింతించు చుండగా చండా మార్కులు " చిన్నతనము చేత వీడిట్లున్నాడు కాని పెద్ద యైనచో బాగు పడును. వీనికి మరల విద్యలు భోధించెదమని తీసికొని పోగా ,ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షస బాలురను ప్రోగు చేసి వారి చేత గూడ హరినామ సంకీర్తన చేయించెడి వాడు .
గురువులు ఆందోళన పడుచు వచ్చి హిరణ్య కశిపునితో "నీ కొడుకును మేము చదివించలేము. వీడు మిగిలిన రాక్షస బాలకులను గూడా చెడ గోట్టుచున్నా" డని చెప్పిరి .హిరణ్య కశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని బిలిపించి ,"నీవు స్మరించుచున్న ఆ శ్రీ హరి యెచ్చట నున్నాడో చూపగలవా ? " అని యడుగగా ఆ భక్తుడు ,

"ఇందు గలడందు లేడను
సందేహము వలదు చక్రి సర్వోప గతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దాన వాగ్రణి ! వింటే "

అని సమాధాన మిచ్చెను. దానికి దానవ రాజు మరింత మండిపడి యీ స్తంబమున వానిని జూపు మనుచు ఒక స్తంబమును గదతో గొట్టెను. దాని నుండి నరసింహ మూర్తి యావిర్భ వించెను. హిరణ్య కశిపుడతనితో యుద్దమునకు తలపడెను . కాని నరసింహుడాతనిని బట్టుకుని తొడలపై బెట్టుకుని గోళ్ళతో చీల్చి సంహరించెను .ఆ ఉగ్ర నరసింహుని జూచి లోకములన్నియు భయపడెను . కాని ప్రహ్లాదుడు భయపడక అతనికి నమస్కరింపగా అతడు ప్రహ్లాదుని శిరస్సుపై చేయుంచెను .ఆ బాలుడు మహా జ్ఞానియై దేవుని స్తుతించెను .ఆయన " నీకే వరము కావలెనో కోరు "మనగా ", కామములు వృద్ది పొందని వరమి "మ్మని ప్రార్ధించెను. ఆ దేవుడు మెచ్చి ,ప్రహ్లాదా ! నీవు నిష్కామ బుద్దితో ఈశ్వరార్పణముగా సకల కార్యములు చేయుచు రాక్షస రాజ్యమును పాలించి చివరికి నన్ను చేరెదవు." అని పలికి .తన్ను జూడ వచ్చిన బ్రహ్మతో " రాక్షసుల కిట్టి వరము లెన్నడును ఇయ్యకు "మని చెప్పి యదృశ్యుడయ్యెను 



వృత్రాసురుడు

పూర్వము త్వష్ట యను ప్రజాపతికి సర్వజ్ఞుడైన విశ్వరూపుడను కొడుకు పుట్టెను . అతనికి మూడు తలలు దేవత లతనిని గురువుగా భావించిరి .ఇంద్రుడతని యెద్ద ,"నారాయణ కవచము "ఉపదేశము పొందెను.
విశ్వరూపడొక నోట సురాపానము ,ఒకనోట సోమపానమును చేయును. మూడవ నోటితో అన్నము దినును. అతడు రాక్షసులకు గూడ యజ్ఞభాగము లిప్పించు చుండగా ఇంద్రుడతని తలలు ఖండించెను. దానివలన అతనికి బ్రహ్మ హత్యా దోషము కలిగెను. దాని నొకయేడు భరించి అది పోగొట్టు కొనుటకై ఇంద్రుడు ,ఎంత గోయి యైన పూడునట్లు వరమిచ్చి భూమికి నాలుగవ వంతు పాపమును ,ఎన్ని కశ్మలములు చేరినను పవిత్ర మగునట్లు వరమిచ్చి నీటి కొక నాలుగవ వంతును ,ఎన్ని సార్లు కొట్టివేసినను చిగురించు నట్లు వరమిచ్చి చెట్లకొక నాలుగవ వంతును ,కామ సుఖములతో పాటు సంతానము గూడ కలుగునట్లు వరమిచ్చి స్త్రీలకొక నాలుగవ వంతును ఆ పాపమును పంచి యిచ్చి తానా బ్రహ్మ హత్యా దోషము నుండి విముక్తుడయ్యెను. భూమికి చవిటి నేలలు ,నీటికి నురుగు ,చెట్లకు జిగురు ,స్త్రీలకు రజస్సును ఈ దోషము పంచుకొన్నందుకు గుర్తులు.

విశ్వరూపుని ఇంద్రుడు చంపుట చేత త్వష్టకు పుత్ర శోకము కలిగెను. దానిని సహింపలేక అతడింద్రుని జంపు కొడుకు పుట్టవలేనని యజ్ఞము చేసెను. యజ్ఞ కుండములో నుండి భయంకర రూపముతో రాక్షసుడొకడు పుట్టెను. వాడే వృతుడు. బ్రహ్మను గూర్చి తపము చేసి వారము లొంది లోక కంటకుడై ప్రవర్తించు చుండెను. దేవతలతని పైకి యుద్దమునకు రాగా వారి నందరును వృతు డోడించెను. ఇంద్రుడు యుద్దము చేయుచుండగా అతని చేతి ఆయుధము జారి పడెను. వృత్రు డింద్రునితో, "ఆయుధము లేని వానిని ,పారిపోవు వానిని నేను చంపను పొమ్మ "ని విడిచి పెట్టెను.

దేవతలందరును శ్రీ హరిని ప్రార్ధింపగా ఆయన "దధీచి మహామునిని అతని వెన్నెముక నడుగుడు. ఆయన దాత ,ఇచ్చును .దానితో విశ్వ కర్మ ఇంద్రుని కాయుధము చేసి ఇచ్చును. దానితో వృతుని ఇంద్రుడు చంపును. " అని చెప్పెను . దేవతలట్లే దధీచి నడిగిరి. ఆయన అది దేవకార్యమని గ్రహించి "నేను యోగ శక్తితో ప్రాణము విడుతును నా ఎముకలు మీరు తీసికొను "డని యోగ మార్గమున శరీరము చాలించెను. విశ్వకర్మ ఆయన వెన్నెముక తో వజ్రాయుధము చేసి ఇంద్రునికి ఇచ్చెను. దేవత లుత్సాహముతో వృతుని పై దండ యాత్ర చేసిరి . అ మహా యుద్దములో వృతుడు ఐరావతముతోను ,వజ్రాయుధము తోను గూడ ఇంద్రుని మ్రింగి వేసెను. ఇంద్రుడు అతని కడుపు చీల్చి చంపి బయటకు వచ్చెను . కాని వృతుని చంపి మరల బ్రహ్మ హత్యా పాతకముబ గట్టుకున్న ఇంద్రుని, దేవ ఋషి పితృ గణములు విడిచి పోయిరి.

వారట్లేల ఇంద్రుని విడిచి పోయిరని పరీక్షిత్తు అడుగగా శుకుడిట్లు చెప్పెను.


వృత పరాక్రమమునకు భయపడి దేవతలు, మునులు ఇంద్రునొద్దకు వచ్చి ,నీవు వృతాసురుని వధింపు "మనగా అతడు " పూర్వము ఇట్లే మీ మాటలు విని విశ్వరూపుని జంపినాను. ఆ దోషము పోగొట్టుకొనుటకు నాకు తల ప్రాణము తోకకు వచ్చినది .మరల ఇంకొక బ్రహ్మ హత్యకు ఒడి గట్టలే "నని నిరాకరించెను. దానికి మహర్షులు" నీచేత మే మశ్వమేద యాగము చేయించి పాప విముక్తుని జేయుదు" మని చెప్పి సుర రాజును ఒప్పించిరి. అందుకే వృత్రుని  జంపి ఇంద్రుడు బ్రహ్మ హత్యా పాపమును మూట గట్టుకొనెను .
ఆ పాపము ఒక చండాల స్త్రీ రూపమున ఇంద్రుని వెంట బడెను, ఇంద్రుడు పారిపోయి మానస సరస్సులోని తామర కాడలో దాగు కొనెను .అందున్న దారాలలో కలిసిపోయి ఒక రూపమన్నది లేక వేయేండ్లు ఉండెను. అది శివుని దిక్కు (ఉత్తరము ) కాన చండాలి అచ్చటికి పోలేక ఇంద్రునికై బయట కాచుకుని కూర్చుండెను.
అంతకాలము స్వర్గ రాజ్య మరాజకము కాకూడదని ,భూలోకము నుండి నూరు అశ్వమేధ యాగములు చేసిన నహుషుడను రాజు ను దెచ్చి దేవతలు ,ఋషులు ఇంద్ర పదవిలో నిలిపిరి .అతడా పదవితో మదించి ,శచీ దేవిని భార్యగా నుండుమని నిర్భందించెను . ఆమె, "బ్రహ్మర్షులు మోసెడు పల్లకిలో రమ్ము .నిన్ను వరించెద "ననెను .నహుషుడట్లే వచ్చుచు అగస్త్యుని "సర్ప -సర్ప " (దగ్గరకు సమీపింపుము) అని కాలితో దన్నేను. ఆ ముని కోపించి నీవు సర్పమై భూలోకమున బడి యుండు "మని శపించెను. దానితో నహుషుని యింద్ర పదవి మట్టిలో గలిసెను.
ఇంద్రుడా పద్మనాళములో నుండి యిన్నేండ్లును హరిధ్యానము చేయుచుండెను. మునులును ,దేవతలును ఇంద్రుడున్నచోటు తెలిసికొని వచ్చి అతనిని మన్నించు మని కోరి స్వర్గమునకు దెచ్చిరి. .పాప రూపిణి యైన చండాలి , అంతకాలము విష్ణు ధ్యానము చేసిన ఇంద్రుని చేరలేక పోయెను. మునులింద్రుని చేత అశ్వమేధ యాగము చేయించి పాప విముక్తుని జేసిరి.

ఈ వృత్రాసుర వధను జదివిన వారును వినిన వారును అఖండ భోగ భాగ్యములతో తుల తూగి ,తుదకు మోక్షము నొందుదురు .

శత్రు వెంత వాడైనను ఉపెక్షింప రాదు ,ఇది రాజనీతి .

పరీక్షిత్తు శుకుని జూచి ,"మహాత్మా ! అసురుడైన వృత్రున కంతటి ధర్మము జ్ఞానము ఏల కలిగినవి ? " అని యడుగగా శుక మునీంద్రు డిట్లు చెప్పెను.

చిత్ర కేతూపాఖ్యానము

చిత్ర కేతుడు శూర సేన దేశమునకు రాజు .సంతానము కొరకు కోటి మంది స్త్రీలను పెండ్లాడెను .కాని ఫలము లేకపోయెను . ఒక నాడంగీరసుడను ముని అతని మందిరమునకు రాగా ,రాజు పూజించి ,తన అపుత్రత్వమును గూర్చి చెప్పెను .

అంగీరసుడు రాజుచేత పుత్రకామేష్టి చేయించి యజ్ఞ ప్రసాదము నాతని పట్టపు రాణి కృత ద్యుతికి ఇచ్చెను. రాజునకు కుమారుడు పుట్టెను .రాజు ఆ పుత్రుని వ్యామోహములో పడి ,వానిని వాని తల్లిని మిక్కిలి ఆదరించు చుండెను .ఇది తక్కిన రాణులకు కంటగిం పయ్యేను . వారు బాలునికి విషము బెట్టి చంపిరి. మరణించిన బాలునికై రాజును రాణియు విలపించు చుండగా అంగీరసుడు నారదునితో వచ్చి రాజుతో ఇట్లనెను. "రాజా ! " ఋణాను బంధ రూపేణ పశుపత్ని సుతాలయాః " అందురు . (పశువులు ,భార్యలు,కొడుకులు ,ఇండ్లు మొ|| ఋణమును బట్టి వచ్చుచు పోవుచుందురు) జగత్తు స్వప్నము వంటిది . స్వప్నము నిజమగునా ? కర్మ వశమున జీవులు పుట్టి గిట్టు చుందురు. నీకు వీడేమగును? వానికి నీవేమగుదువు? ఇదంతయు భౌతిక దేహమున్నంత వరకే . నీవు శ్రీ హరిని ధ్యానించుచు మోహ వికారములను త్యజింపుము." నారదుడు , "రాజా ! నీకును వీనికి ని బందుత్వమేమున్నదో చూడు " మని బాలుని దేహమును జూచి ,"జీవా ! మే తల్లి దండ్రులను బంధువులును నీకై దుఃఖించు చున్నారు. నీవు తిరిగి ఈ దేహములో ప్రవేశించి వీరికి సంతోషము గలిగింపు "మనెను .
బాలుడు , " కర్మ బద్దుడనై అనేక జన్మము లెత్తుచున్ననాకు వీరే జన్మములో తల్లిదండ్రులు ? ఒక్కొక్క జన్మములోను వేర్వేరు తల్లి దండ్రులు బంధువులు నాకేర్పడుచున్నారు .సర్వేశ్వరుడైన శ్రీ పతి తన మాయాదీనులను జేసి జీవులను పుట్టించుచు తిరిగి తనలో లీనము చేసికొనును . అని పలికి ఆ జీవుడు వెళ్ళిపోగా చిత్ర కేతుడు మోహము విడిచి బాలునికి యమునా నదిలో ఉత్తర క్రియలు చేసెను . నారదునకు నమస్కరించ గా అతడు రాజునకు నారాయణ మంత్రము పదేశించెను.

నియమ నిష్టలతో ఏ మంత్రము నైనను ఏడు రోజులు జపించినచో సిద్ది కలుగును. రాజట్లు ఏకాగ్రత తో ఏడు రోజులా మంత్రమును జపించాగా ముకుందుడు ప్రసన్నుడై విద్యాధరాది పత్యమును ,విమానమును అనుగ్రహించెను .
ఒకనాడతడు విమానముపై కైలాసము మీదుగా బోవుచు కొలువులో నున్న శంకరుని దర్శనము చేసికొని నమస్కరించెను .ఒకే పీటముపై పార్వతిని తొడమీద కూర్చుండ బెట్టుకున్న శివుని జూచి " మీరు ప్రకృతి పురుషులు కావచ్చు .ఏకాంత సమయములో నిట్లు కూర్చుండ వచ్చును. గాని నిండు సభలో నిట్లుండుట న్యాయమా ? "

అని యాక్షే పించెను . పార్వతి కోపించి ,"ఇందరును ఏమనలేదు గాని నీవు మాత్రము మమ్ము అధిక్షేపింతువా ? ఇంత అహంకారము గల నీవు రాక్షస జన్మ మెత్తుము. "అని శపించెను . చిత్ర కేతుడు తన తప్పు తెలిసికొని ఉమాశంకరులకు నమస్కరించి "అమ్మా ! జీవులకు వారి వారి కర్మములవలన జనన మరణములు ,సుఖ సంపదలు కలుగు చుండు ననుట కిదియే నిదర్శనము .నన్ననుగ్రహింపుము. నీ శాపమునకు నేను భయపడుట లేదు. జగత్పితురు లైన మిమ్ము అధిక్షేపించినందుకు చింతించు చున్నా " నని మ్రొక్కి వెడలిపోయెను .
తరువాత అందరును వినుచుండగా పార్వతితో శివుడు "చూచితివా ? విష్ణు భక్తుల నిస్స్ర హత్వము ! వారికి సుఖ దుఃఖములు సమానములు .తిరిగి నీకు శాప మియ్యగల వాడైనను శాంతుడు కాన నీ శాపమును తల దాల్చి వెడలిపోయెను " అని పలికెను.

అతడే త్వష్ట చేసిన పుత్రకామేష్టిలో దక్షిణాగ్ని యందు వృత్రాసుడుగా జన్మించెను .అతనికి ఆ ధర్మము, జ్ఞానము పూర్వ జన్మము నుండి సంక్రమించినవే .

http://srimadbhagavatasudha.blogspot.in/2012/11/blog-post_1081.html



శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం 


ప్రధమాధ్యాయం
రెండో అధ్యాయం



http://www.epurohith.com/telugu/viewtopics.php?page=7&cat_id=941

http://www.epurohith.com/telugu/viewtopics.php?page=     7&cat_id=    941

Updated 26 December 2017, 9 October 2013

No comments:

Post a Comment